కోల్‌కతాలో 19వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు..
2027 జనవరి 7 నుంచి 9 వరకు, ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సూర్య జాతీయ డెస్క్: ప్రవాస భారతీయుల సదస్సు 19వ ఎడిషన్ ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) కన్వెన్షన్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 2027 జనవరి 7 నుంచి 9 వరకు జరగనుంది. విదేశాంగ శాఖ (ఎంఈఏ) శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. కేంద్ర విదేశాంగ శాఖ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలిసి ఈ సదస్సును నిర్వహించనున్నాయి.
ఈ మూడు రోజుల సదస్సులో యూత్ పీబీడీ విభాగం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు, యువ ప్రవాస నాయకులు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు, విద్యావేత్తలు, ఆవిష్కర్తలు, ఇతర భాగస్వాములను ఈ వేదిక ఒక్కచోట చేర్చుతుందని వారు వివరించారు. ప్రవాస భారతీయులకు, భారత్‌కు మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడం, వారి సేవలను గుర్తించడం ఈ సదస్సు లక్ష్యమని ఎంఈఏ పేర్కొంది. సదస్సు నమోదు, కార్యక్రమ వివరాలను త్వరలో ప్రకటిస్తామని, తక్షణ సందేహాలకు స్థానిక భారత రాయబార కార్యాలయాన్ని లేదా కాన్సులేట్‌ను సంప్రదించవచ్చని ఎంఈఏ తెలిపింది.
సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేసి, ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారని వెల్లడైంది. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు విదేశాల్లో ఉన్న భారతీయులకు, భారత సంతతి వ్యక్తులకు, వారు నడిపే సంస్థలకు ఇచ్చే అత్యున్నత గౌరవం. గత 18వ సదస్సు 2025 జనవరి 8 నుంచి 10 వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది.
మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుకుంటారు. 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఈ సదస్సులను ప్రారంభించారు. 2015 నుంచి ఈ సదస్సును రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ, మధ్య సంవత్సరాల్లో నిర్దిష్ట అంశాలపై సమావేశాలు జరుపుతున్నారు.