నింబగల్లు ఎస్‌ఎస్ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా
అనంతపురం బ్యూరో : మండలంలోని నింబగల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండి పడటంతో తుంగభద్ర జలాలు వృథాగా పోతున్నాయని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో శ్రమించి ట్యాంకులోకి మళ్లించిన తాగునీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
గండిని వెంటనే పూడ్చి నీటి వృథాను అరికట్టాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఉరవకొండ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత ఏడాది కూడా ఇదే సమస్య తలెత్తినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్ కుమార్, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు నెరమెట్ల యోగేంద్రరెడ్డి, ఉరవకొండ రూరల్ అధ్యక్షుడు ఎర్రీస్వామిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు డిష్ సురేష్, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్, శివరాజ్, అంజి తదితరులు ట్యాంకును పరిశీలించి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.