స్వచ్ఛతలో గిద్దలూరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు
మున్సిపల్ కమిషనర్‌ను అభినందించిన ఎమ్మెల్యే ముత్తుముల
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ మున్సిపాలిటీ–2026 రాష్ట్రస్థాయి అవార్డుకు గిద్దలూరు మున్సిపాలిటీ ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాల అమలులో మున్సిపాలిటీ చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గిద్దలూరు మున్సిపాలిటీకి గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో అధికారులు, సిబ్బంది సమష్టిగా చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తితో పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు.