విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన అన్నదాతలు
సూర్య కోనరావుపేట:వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడం.. మరోవైపు లోవోల్టేజీతో మోటార్లు వరుసగా కాలిపోతుండటంతో ధర్మారం రైతులు రోడ్డెక్కారు. పంటలకు నీరందక పైర్లు ఎండిపోతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల–నిమ్మపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాలిపోయిన బోరు మోటార్‌ను రోడ్డుపై ఉంచి బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.రైతుల ఆందోళనకు బీజేపీ మండల అధ్యక్షుడు, ధర్మారం సర్పంచ్ మిర్యాల్కర్ బాలాజీ మద్దతు ప్రకటించి రాస్తారోకోలో పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న విద్యుత్ అధికారులను రైతులు నిలదీశారు. ఓ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో రోజు మార్చి రోజు విద్యుత్ సరఫరా చేయడంతో పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోవోల్టేజీ కారణంగా తరచూ మోటార్లు దగ్ధమై వేలాది రూపాయల నష్టం వాటిల్లుతోందని వాపోయారు.పంటలు ఎండిపోతున్నాయి.. మోటార్లు కాలిపోతున్నాయి.. ఇంకా ఎన్నాళ్లు ఈ సమస్య? అంటూ రైతులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేసి, లోవోల్టేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు రైతులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.