ఇంటిపై సోలార్.. కరెంటు బిల్లుకు కోత. ,సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈ మల్లికార్జున్
చౌటుప్పల్,: ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకుని సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంతోపాటు విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చని టీజీఎస్పీడీసీఎల్ చౌటుప్పల్ డీఈ మల్లికార్జున్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చౌటుప్పల్ తంగడపల్లి రోడ్డులోని విద్యుత్ డీఈ కార్యాలయంలో శనివారం పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వినియోగదారులు ప్రధానమంత్రి సూర్యఘర్ అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకుని, తమ విద్యుత్ కనెక్షన్ వివరాలు, మొబైల్ నంబర్ తదితర సమాచారాన్ని నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఎంపిక చేసిన నమోదిత సోలార్ వెండర్ ద్వారా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటైన తర్వాత విద్యుత్ సంస్థ తనిఖీ చేసి నెట్ మీటర్ ప్రక్రియను పూర్తి చేస్తుందని అధికారులు వివరించారు.
పథకం ద్వారా లభించే సబ్సిడీ, బ్యాంకుల ఆర్థిక సహాయం, సోలార్ ఏర్పాటు తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీ పద్మ, ఏఈ సతీష్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్లు, సోలార్ వెండర్ల ప్రతినిధులు చేతన్‌కుమార్, చిప్పలపల్లి విన్ను, సతీష్, పబ్బు అనురాగ్, శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.