telanagana
సద్దుల బతుకమ్మకు కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం
సూర్య, వేములవాడ: వేములవాడ పట్టణంలోని మూలవాగు బతుకమ్మ తెప్ప వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే, అదనపు కలెక్టర్ నగేష్లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆహ్వానించారు. కలెక్టరేట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ లోకేష్, కౌన్సిలర్లతో కలిసి అధికారులకు ఆహ్వాన పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ కాగా, వేములవాడలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ప్రత్యేక సంప్రదాయమని వివరించారు. మూలవాగు వద్ద జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ, ఏల శ్రీనివాస్, తోట రాజు, కొండ రాజశేఖర్, సంతోష కరుణాకర్, రామతీర్థపు కృష్ణవేణి హరీష్ తదితరులు పాల్గొన్నారు.