రోడ్డు ప్రమాదంలో కోటకొండ వాసి మృతి
*నారాయణపేట, సూర్యన్యూస్:*జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన యువకుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై లారీ మొరాయించడంతో డ్రైవర్ దానిని రోడ్డుపైనే నిలిపివేసినట్లు సమాచారం. అదే సమయంలో కోటకొండకు చెందిన వేపూరు నవీన్ కుమార్ బైక్ పై వెళ్తున్న సందర్భంగా జడ్చర్ల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని గమనించకపోవడంతో వెనుక వైపు నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన నవీన్ కుమార్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నవీన్ కుమార్ మృతి చెందాడు. రోడ్డుపై లారీని ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా నిలిపి ఉంచడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.