నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు
*నారాయణపేట (నర్వ), సూర్యన్యూస్ :* నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా నర్వ పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌వీకే నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల ఏడీఎస్‌సీ జె. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నాణ్యమైన వరి విత్తనోత్పత్తికి రైతులు పాటించాల్సిన పద్ధతులను నాట్లు వేయడం నుంచి పంట కోత, విత్తనాల నిల్వ వరకు వివరించారు. పంట యాజమాన్య పద్ధతులు, కలుపు నివారణ, చీడపీడల నియంత్రణ, సమతుల్య ఎరువుల వినియోగం, పంట పరిశుభ్రత, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాల శుద్ధి, నిల్వ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి రైతులు శాస్త్రీయ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు, భవిష్యత్ సాగుకు నాణ్యమైన విత్తనాల లభ్యతను పెంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నర్వ పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, సీఈఓ ఉదయ్‌కుమార్, నర్వ మండల వ్యవసాయ అధికారి అఖిలారెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.