జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ
ప్రకృతిలో జీవవైవిద్యం లేకపోతే మానవ మనుగడ లేదని అమర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గౌరనేని రమాదేవి పేర్కొన్నారు. ఎస్వీయూ విద్యార్థి సంక్షేమ సాంస్కృతిక వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శేషాచలం, జీవ వైవిధ్య సజీవ వారసత్వం అనే అంశంపై వారం రోజుల పాటు వర్సిటీ శ్రీనివాసం ఆడిటోరియంలో జరిగిన అవగాహన సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆమె బయోడైవర్సిటీ డైరెక్టర్ చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి నియమాల ప్రకారంగా అడవులను సంరక్షిస్తూ వాటిలోని విశిష్ట సంపదను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ప్రకృతిని నాశనం చేయడం ద్వారా జీవవైవిద్యం అసమతుల్యం వలన మానవ మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. బయోడైవర్సిటీ డైరెక్టర్ చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్ జియో వైవిధ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మనందరి బాధ్యత అన్నారు. వర్సిటీ రెక్టర్ ఆచార్య చండ్రాయుడు, రిజిస్ట్రర్ ఆచార్య భూపతి నాయుడులు మాట్లాడుతూ విద్యార్థులకు వారం రోజులపాటు జీవవైవిద్యంపై అవగాహన, వక్తత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం బీషీ రమణ రచించిన ట్రెక్కింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో డిఎన్డబ్ల్యూసిఏ డైరెక్టర్ ఆచార్య బీడీ మురళీధర్, అసిస్టెంట్ డైరెక్టర్, కోఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, అధ్యాపకులు, పరిశోధకులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి