జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు
జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు
‘డిమాండ్ల దినోత్సవం’ విజయవంతం చేయాలి
హన్మకొండ టౌన్ , సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ సూర్య,
జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపు మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ‘డిమాండ్ల దినోత్సవం’ను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శి ఊటుకూరు సాయిరాం కోరారు.
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మీడియా రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, జర్నలిస్టేతర మీడియా సిబ్బందికి ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు కల్పించేందుకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్, గుర్తింపు కార్డులు, విధి నిర్వహణకు అవసరమైన సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
కార్యక్రమంలో హౌసింగ్ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వల్ల వెంకటరమణ, టీ యూ డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు మధు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పి.వి. మదన్ మోహన్, తోట సుధాకర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కంకణాల సంతోష్, వేణుమాధవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య , బొల్ల అమర్ తదితరులు పాల్గొన్నారు.