నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు
నేటి నుంచి 'సమ్మేటివ్-1' పరీక్షలు:
6, 9 తరగతులకు 'ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం'
పైలట్ ప్రాజెక్ట్‌గా విద్యాశాఖ నిర్ణయం
తొమ్మిదో తరగతికి రాష్ట్ర వ్యాప్తంగా, ఆరో తరగతికి 9 జిల్లాల్లో కొత్త విధానం
ఉత్వర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డా. ఇ. నవీన్ నికోలస్
నెక్కొండ సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ (సూర్య): అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న సంగ్రహణాత్మక మూల్యాంకనం ( సమ్మేటివ్ అసెస్మెంట్ వన్) పరీక్షల విధానంలో
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేపట్టింది. విద్యార్థుల విద్యా ప్రమాణాల పరిశీలన, పారదర్శకత పెంపొందించేందుకుగానూ 6, 9 తరగతులకు పైలట్ ప్రాజెక్ట్‌గా ‘ఎక్స్‌టర్నల్ ఎవల్యూషన్’ (బహిర్గత మూల్యాంకనం) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అండ్ సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠశాల ఉపాధ్యాయ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఎవరికి ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం..
రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్-1 పరీక్ష సమాధాన పత్రాలను ఎక్స్‌టర్నల్ విధానం ద్వారానే వ్యాల్యుయేషన్ చేస్తారు. అలాగే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంపిక చేసిన 9 జిల్లాల్లో మాత్రమే ఆరో తరగతికి ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం ఉంటుంది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఆరో తరగతి బహిర్గత మూల్యాంకనం నిర్వహిస్తారు.
ఈ నూతన విధానం అమలుకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని రాష్ట్రంలోని ఆర్‌జెడి లు, జిల్లా విద్యాశాఖాధికారుల ను విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ గతంలో రాష్ట్ర విద్యా పరిశోధన మండలి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుందని తెలిపారు.