telanagana
వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30): వికారాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర లా & ఆర్డర్ డీజీ మరియు పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ భగవత్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆయనకు ఘన స్వాగతం పలికారు. బొంరాస్‌పేట్, కొడంగల్ పోలీస్ స్టేషన్లతో పాటు కొడంగల్ సీఐ కార్యాలయం మరియు దుద్యాల పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణ పనులను డీజీ స్వయంగా పరిశీలించారు. కొనసాగుతున్న నిర్మాణాల తీరును, గదుల ఏర్పాటును, సిబ్బందికి కేటాయించనున్న వసతులను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందికి మెరుగైన పని వాతావరణం, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా భవనాల రూపకల్పన ఉండాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా చూడాలని, అవసరమైన చోట అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మహేష్ భగవత్ సూచించారు. పనులను మరింత వేగవంతం చేసి ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. మెటీరియల్ నాణ్యత, పనుల పర్యవేక్షణ, విద్యుత్ సరఫరా, నీటి వసతి, పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువగా, మెరుగైన సేవలు అందించేలా పోలీస్ స్టేషన్ల నిర్మాణం సురక్షితంగా ఉండాలని ఆయన హితవు పలికారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ ఎన్. శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు వెంకట రమణ, శ్రీశైలం, వేణుకుమార్, సత్యనారాయణ, ఆర్‌ఎస్‌ఐలు శివ, సిద్ధిఖ్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ వైబీ శ్రీనివాస్ రావు, డీఈఈ బాలాజీ దాస్, ఏఈ నవీన్ కుమార్ తదితర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.