రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
- ఆర్వోబీల పనులు నవంబర్ కల్లా మొదలు పెట్టాలని నిర్దేశం
ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఆర్వీబీల పనులు సహా అన్నింటిలో నాణ్యతపై రాజీ పడేది లేదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఏలూరు రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్యాసింజర్స్ వెయిటింగ్ రూమ్, పబ్లిక్ టాయిలెట్స్ సహా స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ, తాను గతంలో తనిఖీకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ పనుల పురోగతిని పరిశీలించారు. మహిళల మరుగుదొడ్లు సహా, కొన్ని సౌకర్యాల విషయంలో ఎంపీ మార్పులు సూచించారు. అనంతరం రైల్వే అధికారులతో సమావేశమైన ఎంపీ, ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్రతిపాదించిన దాదాపు 30 రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల పనుల పురోగతిపై సమీక్షించారు. గత ఏడాది అనుమతులు వచ్చిన ఆర్వోబీల పనులు ఇప్పటికీ మొదలు పెట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పనులు ఎప్పుడు మొదలు పెడతారో స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నవంబరు, డిసెంబర్లో ఎల్ సి 365 సహా మూడు ఆర్వోబీల పనులు మొదలవుతాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి రైల్వే అధికారులు హమీ ఇచ్చారు. అదేవిదంగా ఇప్పటికే ఆర్వోబీలు ఉన్న కొన్ని చోట్ల పర్యవేక్షణ లేక రైల్వే బ్రిడ్జి కింది ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయన్న ఫిర్యాదులను, ఆయా ప్రదేశాల్లో పల్లపు ప్రదేశాల్లో వర్షా కాలంలో నీరు నిలిచి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన ఎంపీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఎంపి పుట్టా మహేష్ కుమార్.. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులతో పాటు కొత్తగా నిర్మించనున్న పలు ఆర్ఓబీల పనులపై అధికారులతో సమీక్షించి తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. పబ్లిక్ టాయిలెట్స్, టికెట్ కౌంటర్లు వంటి చోట్ల ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించినట్లు ఎంపీ చెప్పారు. ప్రైవేటు భూములు, ఇళ్ళకి ఎక్కువ నష్టం జరుగకుండా ఆర్వోబీ నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్న ఎంపీ, ఈ దిశగా కసరత్తు చేసి ఈ ఏడాది చివరిలోపు సాధ్యమైనన్ని చోట్ల ఆర్వోబీ నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎంపీ పర్యటన, సమీక్షలో సీనియర్ డివిజనల్ రైల్వే ఇంజనీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.