ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల, మేజర్ న్యూస్:
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపుని చ్చారు.పులివెందుల పట్టణంలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన అవినాష్‌రెడ్డి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సంఘాల ప్రతినిధులు కూడా ఎంపీని కలిసి తమ సమస్యలను వివరించడంతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలపై అవినాష్‌రెడ్డి పలు ఆరోపణలు చేశారు. పోలీసులను ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని, ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.