మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి : పోర్ట్ డిప్యూటి చైర్ పర్సన్ రోషిని అపరంజి
సింధియా, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతో పాటు సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటి చైర్‌పర్సన్ రోషిణి అపరంజి కోరాటి అన్నారు. విశాఖపట్నంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 150 మంది మహిళలకు ఆమె చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, వ్యాపారానికి అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వారికి స్వయం ఉపాధి మార్గాలను చూపేందుకు కోరమండల్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇటువంటి ఉత్తమ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇక్కడ నేర్చుకున్న జ్యూట్ బ్యాగుల తయారీ, హోమ్ ఫుడ్స్ తయారీ, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ నైపుణ్యాలతో మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ సంస్థ ప్రతినిధులు ఆర్ షణ్ముగం, కెవివివైఎస్ నారాయణ, జె మహేష్, కె లక్ష్మీనారాయణ, వెంకటరమణ, పలువురు సిబ్బంది, శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.