రూ.11.50 కోట్లతో రోడ్ల నిర్మాణం : శంకుస్థాపన చేసిన గంటా
....
ఆనందపురం:30సెప్టెంబర్ మేజర్ న్యూస్.
భీమిలి నియోజకవర్గంలో రూ. 11.50 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆనందపురం మండల కార్యాలయ ప్రాంగణంలో బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని తెలిపారు. రూ. 2.83 కోట్లతో బి.ఎన్.రోడ్డు నుంచి జీకే రోడ్డు వరకు, రూ.1.50 కోట్లతో వీపీ రోడ్డు నుంచి నారాయణ రాజు పేట వరకు, రూ. 1.31 కోట్లతో జాతీయ రహదారి నుంచి జీరుపేట వరకు, రూ. 1.02 కోట్లతో జీరుపేట నుంచి ఎస్టీ కాలనీ వరకు ప్రధాన రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. అలాగే కణమాం నుంచి బీడీ పాలెం వరకు, విజయనగరం శొంట్యాం రోడ్డు నుంచి పేకేరు వరకు, కుసులువాడ ఎస్సీ కాలనీ నుంచి కుసులువాడ వరకు, బీఎన్ రోడ్డు నుంచి బాకూరుపాలెం వరకు, మద్ది నుంచి తునిపాలెం వరకు, పొట్నూరు జెడ్పీ రోడ్డు నుంచి కుమరం వరకు, అలమండ నుంచి బోని వాటర్ వర్క్స్ వరకు రోడ్ల నిర్మాణానికి రూ.4.80 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దిష్ట గడువులోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆనందపురం డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, తాట్రాజు అప్పారావు, కోరాడ రమణ, సరగడ అప్పారావు, గాడు వెంకటప్పడు, బి.ఆర్.బి. నాయుడు, లొడగల వెంకట్రావు, కాళ్ల నగేష్ కుమార్,సూరాల సత్యవర ప్రసాద్, మహంతి శివాజీ, కె. రామానాయుడు, గండ్రెడ్డి సోమినాయుడు, ఎర్ర రాజు, బంకు రాజు తదితరులు పాల్గొన్నారు.