ప్రజా ప్రభుత్వమా... లంచాల ప్రభుత్వమా?
రూ.70 వేల లంచం ఆరోపణలతో సంచలనం
- యాదయ్య కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు పరామర్శ
- భూమి రికార్డుల గల్లంతుపై ఆగ్రహం
- తక్షణ విచారణకు డిమాండ్
షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో గుండెపోటుతో మృతి చెందిన వారణాసి యాదయ్య (50) కుటుంబాన్ని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన… వారి సమస్యలను తెలుసుకుని అధికారుల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
యాదయ్య కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 483లో నాలుగు ఎకరాల భూమి రికార్డుల్లో కనిపించకపోవడం వివాదానికి దారితీసింది. భూమి వివరాలు చూపించాలని పలుమార్లు అధికారులను కోరినా కాలయాపన చేశారని, చివరికి లంచం అడిగారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆర్‌ఐ విజయ్ కుమార్‌కు రూ.70 వేల నగదు ఇచ్చినట్లు వారు పేర్కొనడం సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా బక్కని నర్సిములు మాట్లాడుతూ… “ప్రజా ప్రభుత్వం” అంటూ చెప్పుకునే ప్రభుత్వంలో లంచగొండితనం ఆరోపణలు రావడం దారుణమన్నారు. వెంటనే తహసీల్దార్, ఆర్‌డీఓ, కలెక్టర్ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి, నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భూసేకరణ నిబంధనల ప్రకారమే: తహసీల్దార్ ఎం.డి. అన్వర్
మరోవైపు ఆరోపణలపై షాబాద్ తహసీల్దార్ ఎం.డి. అన్వర్ స్పందించారు. సర్వే నంబర్ 483లో సుమారు 153 ఎకరాల భూమిని ప్రజోపయోగ కార్యక్రమాలు, టీజీఐసీ అభివృద్ధి కోసం రైతుల సమ్మతితోనే సేకరించామని తెలిపారు. నిబంధనల ప్రకారం అసైనీలకు ఎకరానికి 800 గజాలు, రైతులకు 300 గజాల చొప్పున ప్లాట్ల కేటాయింపు జరుగుతోందన్నారు.
ఇతర గ్రామాలతో కలిపి సుమారు 1,100 ఎకరాల భూమి సేకరించి టీజీఐసీకి అప్పగించామని చెప్పారు. భూవివాదాలపై రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని, 10-15 రోజుల్లో సమస్యల పరిష్కారం చేసి అర్హులందరికీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అధికారులపై వచ్చిన లంచాల ఆరోపణలు ఆధారాలతో రుజువైతే ఎవరినీ వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 05)