telanagana
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
కీసర, మేజర్ న్యూస్,(అక్టోబర్ 05):కీసర సెక్టార్ పరిధిలో సోమవారం పోషణ మహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోజువారీ ఆహారం, పోషక విలువలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు.రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గుడ్లు, మాంసం, చేపలతో పాటు సిరిధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని వివరించారు.అదేవిధంగా జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, పిల్లలకు చిన్ననాటి నుంచే అన్ని రకాల పోషకాహారాలను అలవాటు చేయాలని సూచించారు. “పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది… అలాగే పిల్లల ఆరోగ్యం, పోషణ బలంగా ఉంటేనే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదుగుతారు” అని కార్యక్రమంలో పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలు, పెద్దలు, కిశోర బాలికలు ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం, పరిశుభ్రమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె టీమ్ డాక్టర్ ప్రవీణ్, ప్రవీణ గారు, కీసర సెక్టార్ సూపర్‌వైజర్ సక్కుబాయి, దుర్గ, శిల్ప, సరిత, హంస, భాగ్య, సృజన, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ రాణితో పాటు తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
రిపోర్టర్ గణేష్.