సూర్య, మందమర్రి.పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సింగరేణి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మందమర్రి ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్ – స్పెషల్ క్యాంపెయిన్–6’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. అపరిశుభ్ర పరిసరాలతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వారానికి కనీసం రెండు గంటలు శ్రమదానం చేసి ఇళ్లు, కార్యాలయాలు, పని ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గనులు, కార్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. పరిశుభ్రతతో పాటు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తి సాధించాలని సింగరేణి అధికారులు, ఉద్యోగులకు సూచించారు. అనంతరం అధికారులు, కార్యాలయ సిబ్బందితో కలిసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, పీవో ఎం. కార్తీక్, పర్యావరణ అధికారి కాతం వెంకట్‌రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సి.వి. రమణ, గీతికతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.