నాలుగేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన
సెల్‌ఫోన్ చూపిస్తానంటూ ఇంట్లోకి పిలిచిన వ్యక్తి..
కేసు నమోదు చేసిన పోలీసులు
మంచాల మండలం లోయపల్లి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్ చూపిస్తానంటూ చిన్నారిని ఇంట్లోకి పిలిచిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 30న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గ్రామానికి చెందిన బి. నరేందర్ అలియాస్ నాని (40) సెల్‌ఫోన్ చూపిస్తానంటూ తన ఇంట్లోకి పిలిచాడు. అనంతరం చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం చిన్నారి నొప్పితో బాధపడుతూ తల్లికి విషయం చెప్పింది. బాలికను పరిశీలించగా గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. డయల్-100కు సమాచారం అందడంతో మంచాల పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నరేందర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసిన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఎర్ర లింగం, సూర్య మేజర్ న్యూస్, మంచాల