బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అడ్డుకుంటున్నది వైసీపీనే ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శ
అనంతపురం బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంతో సుమారు 16,800 మంది బీసీలు స్థానిక సంస్థల పదవులను కోల్పోయారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు రాజకీయంగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే, వైసీపీ కోర్టుల ద్వారా అడ్డుకుంటోందని విమర్శించారు.
హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే, బీసీల హక్కుల పరిరక్షణకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామని పరిటాల సునీత పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు సామాజిక న్యాయం, తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.