పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి
విజయనగరం అక్టోబర్ 3 మేజర్ న్యూస్:;విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం మరియు మీ భూమి - మీ హక్కు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ప్రతి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.1 కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రూ.38.10 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరగని అభివృద్ధి నేడు పల్లె పండుగ ద్వారా జరుగుతోందని, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. స్వర్ణ గ్రామం సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులతో స్థానిక సమస్యలపై చర్చించి గ్రామ ప్రజలతో అభివృద్ధిపై చర్చించి ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు చెయ్యలా చెయ్యావసినవి ఉంటే మా దృష్టిలో తీసుకురండి త్వరలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మీ భూమి - మీ హక్కు కార్యక్రమం ద్వారా 337 మంది రైతులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 12 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన నూతన పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందిస్తోందని, గత ముఖ్యమంత్రి తన బొమ్మను పాస్ పుస్తకాలపై వేసుకున్నారని, తాము అలా కాకుండా రైతుకు భద్రత కల్పించేలా పుస్తకాలు ఇస్తున్నామని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచిత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తమ ప్రభుత్వం రద్దు చేసిందని స్పష్టం చేశారు. ఈ నూతన పాస్ పుస్తకాల ద్వారా రైతులకు రావాల్సిన ప్రభుత్వ పథకాల నగదు నేరుగా వారి ఖాతాల్లోకి వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, గడిచిన 28 నెలల్లో పెన్షన్ల కోసం రూ.7,8000 కోట్లు ఖర్చు చేశామని మంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 13 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.