రూటు మార్చిన జగన్-స్థానిక పోరులో సరికొత్త స్కెచ్! -ఇక సిఫార్సులకు NO.. సర్వేలకే YES - గెలుపు గుర్రాలకే టికెట్! మేయర్, మున్సిపల్ చైర్మన్ సీట్లకు 3 పేర్ల ప్యానల్ ఫార్ములా!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహంలో సంచలన మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అనుసరించిన 'అధినేత మెప్పు - నాయకుల సిఫార్సు' విధానానికి స్వస్తి చెప్పి, పూర్తిగా 'గెలుపు గుర్రాల' వేట మొదలుపెట్టారు. పార్టీ వర్గాల్లో ఈ కొత్త వ్యూహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసలు జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
ఈసారి టికెట్ల కేటాయింపులో ఎలాంటి తొందరపాటు వద్దని జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన మేయర్, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ వంటి కీలక పదవులకు ఒకే పేరును ఫైనల్ చేయకుండా, ప్రతి స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థులతో ప్యానల్ సిద్ధం చేయాలని జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఆ ముగ్గురిలో ఎవరు ఫైనల్ అనేది మూడు ఫిల్టర్ల ద్వారా తేల్చనున్నారు:
1.ప్రజల్లో ఆదరణ: స్థానికంగా ప్రజల్లో ఆ అభ్యర్థికి ఉన్న ఇమేజ్, గుర్తింపు ఏంటి?2.సామాజిక సమీకరణం: ఆ నియోజకవర్గంలో కుల, వర్గ సమీకరణాలు ఎవరికి అనుకూలం?3.కేడర్ కంట్రోల్: పార్టీ శ్రేణులను, స్థానిక నాయకులను కలుపుకెళ్లే సత్తా ఎవరికుంది?
గత పాఠాల నుంచి గుణపాఠం!
గత స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల కేవలం సిఫార్సుల ఆధారంగా బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ బలంగా ఉన్నా ఓటమి పాలైన ఘటనలు ఉన్నాయి. అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, స్థానిక పరిచయాలు స్థానిక ఎన్నికల్లో కీలకం అని జగన్ గుర్తించారు.అందుకే ఈసారి "నాయకుడు చెప్పాడు" అనే విధానం కాకుండా "ప్రజలు ఏమంటున్నారు" అనే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్షుల, రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశాల్లో "బలమైన, విశ్వసనీయమైన అభ్యర్థులను ముందే గుర్తించండి. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారం తెప్పించండి" అని జగన్ ఆదేశించినట్లు సమాచారం.
లాబీయింగ్‌కు చెక్.. సర్వేలకు ప్రాధాన్యం!
ఈ కొత్త ఫార్ములాతో తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేసే లాబీయింగ్ సంస్కృతికి చెక్ పడనుంది. ఇకపై ఎవరి సిఫార్సు చెల్లదు. స్వతంత్ర సర్వే సంస్థల నివేదికలు, ఇంటెలిజెన్స్ గ్రౌండ్ రిపోర్ట్, ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగానే టికెట్ ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే చివరి నిమిషంలో రిజర్వేషన్లు, సామాజిక వర్గాల లెక్కలు, స్థానిక రాజకీయ పొత్తుల ఆధారంగా ప్యానల్‌లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని సీనియర్ నేతలు అంటున్నారు. మొత్తానికి ఈసారి స్థానిక పోరులో జగన్ అండ్ కో గెలుపునే లక్ష్యంగా "సర్వే ఆధారిత ఎంపిక" అస్త్రాన్ని సంధించడం ఖాయంగా కనిపిస్తోంది.