అదృశ్యమైన వివాహిత మహిళ హత్య
ప్రియుడే హంతకుడు.. అమృత దారుణ హత్య
కేసును చేదించిన పోలీసులు..
కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 03):
కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్‌కు చెందిన అమృత (34) అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారింది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు ఆమెతో సంబంధం ఉన్న మంగలి ఆనంద్ పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. అమృత భర్త మృతి చెందిన అనంతరం అదే గ్రామానికి చెందిన మంగలి ఆనంద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత నెల 18న అమృత ఫోన్ చేసి ఆనంద్‌ను దోమ మండలం కొత్తపల్లికి పిలిచింది. అనంతరం ఇద్దరూ కలిసి మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం వెన్నచేడు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ అమృతకు సంబంధించిన బంగారం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అమృతను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఆమె చీర కొంగుతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో ఆనంద్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.హత్య అనంతరం మృతదేహంపై డీజిల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిగా కాలకపోవడంతో గోనె సంచుల్లో కుక్కి బైక్‌పై నారాయణపేట జిల్లా కృష్ణా నది వద్దకు తీసుకెళ్లి పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆనంద్‌ను విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ రమేష్ కుమార్ తెలిపారు.
రిపోర్టర్ వడ్ల వినోద్ కుమార్.