అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!”
-వికసిత్ భారత్‌కు ఏపీ నుంచి సహకారం..
-అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
-స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధికి ‘3ఎస్’ మంత్రం
-ఎంఓయూలతో సరిపెట్టం.. ప్రాజెక్టుల అమలే మా టార్గెట్: లోకేష్
-గూగుల్ నుంచి స్టీల్ వరకు.. పెట్టుబడులకు ఏపీని గ్లోబల్ హబ్‌గా మారుస్తాం
-23 క్లస్టర్ల నిర్మాణం.. క్వాంటం నుంచి అగ్రికల్చర్ వరకు కొత్త ఎకోసిస్టమ్
-అమరావతి నుంచి దేశానికి కొత్త మోడల్.. కలసి చరిత్ర సృష్టిద్దాం
-పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
భారతదేశం ఇప్పటివరకు చూడని మార్పు, అభివృద్ధి, సుపరిపాలనని తీసుకురావడానికి మేము తపన పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు మా టీం ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పాన్ ఐఐటి సమ్మిట్ – 2026లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... మేము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి... మోదీజీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి మా వంతు సహకారం అందించాలన్నదే మా ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 4.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది. 50% శాసనసభ్యులు మొదటిసారి గెలిచినవారే, 25 మంది మంత్రులలో 17 మంది మొదటిసారి మంత్రులైనవారు. అనుభవజ్ఞమైన సాఫ్ట్‌వేర్‌కు యువ, డైనమిక్ హార్డ్‌వేర్ కలయికే నేటి ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా, విభిన్నంగా నిలబెడుతోంది. మా టీమ్‌కు ఒక స్పష్టమైన విజన్ ఉంది. ఏ రంగమైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉండాలి. నా దృష్టిలో పాన్ ఐఐటీ అంటే కంపెనీలు, టెక్నాలజీలు, పరిశోధనా సంస్థలు మొత్తం పరిశ్రమలను నిర్మించిన వ్యక్తులు. పాన్ ఐఐటీ 23 ఐఐటీల పూర్వ విద్యార్థులందరినీ ఒకచోట చేర్చుతుంది. భారతదేశం అంతటా, ప్రపంచ ప్రధాన టెక్నాలజీ హబ్ లలో 5 లక్షలకు పైగా ఐఐటీ గ్రాడ్యుయేట్లను కలుపుతుంది. ఈ కమ్యూనిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో సమావేశం కావడం ఆనందంగా ఉంది.
భారత్ అభివృద్ధికి దశాబ్ధం చాలు
అమెరికా, యూరప్ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. దుబాయ్ దాదాపు 30 సంవత్సరాల్లో, సింగపూర్ సుమారు 25 సంవత్సరాల్లో ఆ స్థాయికి చేరుకున్నాయి. భారత్ ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది, అభివృద్ధి సాధించడానికి ఒక దశాబ్దం సరిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆ ‘గోల్డెన్ డికేడ్’ మనదే కావాలి. దీనికి త్రీ “ఎస్” మంత్రమే ఆధారం. మొదటిది — స్పీడ్, రెండవది — సర్వీస్, మూడవది — స్టెబిలిటీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగాన్ని చూస్తే స్పీడ్ కు అర్థం తెలుస్తుంది. మా టీమ్ ఇప్పుడు ఆతృతతో ఉంది. ప్రజలు మాకు ఇచ్చింది ఐదు సంవత్సరాల సమయం. ఆ సమయంలోనే ఫలితాలు చూపించాలి. కేవలం ఎంఓయులు కుదుర్చుకుని వాటిని మర్చిపోయే పని మాది కాదు. ప్రాజెక్టులకు వాస్తవ రూపమిచ్చి, వాటి ద్వారా ఉద్యోగాలు సృష్టించాలన్న తపన మాది. రెండోది సర్వీస్. పరిశ్రమల అభివృద్ధిలో ప్రభుత్వానిది ఎంతో కీలకమైన పాత్ర ఉందని మేము నమ్ముతున్నాం. వ్యవస్థాపకులు, పరిశ్రమలను మేము ‘జాతి నిర్మాణకర్తలు’గా భావిస్తున్నాం. మీతో కలిసి పనిచేయాలి, ప్రతి పాలసీని మీతో కలిసి రూపొందించాలి. ప్రపంచ స్థాయి పాలనను అందించాలి. అదే మా సేవా దృక్పథం. నిజానికి, రాష్ట్రంలోని టాప్ ప్రాజెక్టులపై వ్యక్తిగతంగా నేను శ్రద్ధ వహిస్తాను. ప్రతి శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం ప్రమోటర్లకు వారి ప్రాజెక్టులపై వ్యక్తిగత అప్‌డేట్ పంపుతాను. ఆ సమయంలో వారు తమ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ గురించి చదివే సమయం ఉంటుంది. ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ పెట్టుబడిదారులకు మేము అందిస్తున్న సేవ. మూడవది స్టెబిలిటీ. పాలసీ స్థిరత్వం, పాలసీ ఫ్రేమ్‌వర్క్ చాలా ముఖ్యమైనవి. పాలసీలు కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి.
ఏఐ ద్వారా అధికారులకు దిశానిర్దేశం
ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు సహాయం చేయడానికి ఏఐ ని కూడా ఉపయోగిస్తున్నాం. వారు రూపొందించే పాలసీలు, ప్రభుత్వ ఉత్తర్వులు గత అనుభవాల ఆధారంగా రూపొందించబడుతూ, చట్టపరమైన, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి. దీనికి ఒక మంచి ఉదాహరణ టీచర్ రిక్రూట్‌మెంట్. మేము 16వేల మంది ఉపాధ్యాయులను నియమించుకున్నాం. ఈ ప్రక్రియ చట్టపరమైన పరిశీలనను తట్టుకునేలా ఉండాలని నేను మా కమిషనర్‌కు ఆదేశాలిచ్చాను. ఆయన గతంలో వచ్చిన అన్ని కేసులను ఏఐ ఇంజిన్‌లో విశ్లేషించి, గత ఉత్తర్వులు ఎందుకు నిలిచిపోయాయో అర్థం చేసుకున్నారు. దాని ఆధారంగా అత్యుత్తమ రిక్రూట్‌మెంట్ పాలసీలలో ఒకదాన్ని, చట్టపరమైన పరిశీలనను తట్టుకునేలా ఉత్తమమైన ప్రభుత్వ ఉత్తర్వును రూపొందించాం. మనమంతా కలిసి ఆలోచిస్తే స్థిరత్వాన్ని అందించగలం. మాకు క్వాంటం ఎంత ముఖ్యమో, అగ్రికల్చర్, హార్టికల్చర్ కూడా అంతే ముఖ్యం. మా ప్రభుత్వం మీ ప్రయాణంలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు.
ఎంఓయులపై కాదు... అమలుపైనే దృష్టి
నేను ఇప్పుడు చెప్పబోయే ఉదాహరణలు కేవలం ఎంఓయులు లేదా కాగితాలపై ఉన్న హామీలు కాదు. వాస్తవంగా అమలు జరుగుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాను. మా ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ హార్టికల్చర్ హబ్‌గా మార్చాలనే విజన్ ఉంది. ఆయన ముఖేష్ అంబానీ గారిని ఒప్పించి రాయలసీమలోని మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటు చేయించారు. నిన్న దానికి శంకుస్థాపన చేశాం. ఇది హార్టికల్చర్ ఎకోసిస్టమ్‌లో దాదాపు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను సాధిస్తుంది. పరిశోధన నుంచి ప్రాసెసింగ్ వరకు, మెకనైజేషన్ నుంచి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తి అందించడం వరకు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వరకు మొత్తం వ్యవస్థను నిర్మించడమే లక్ష్యం. రెండవది స్టీల్ రంగం. గతంలో మనకు కేవలం రెండు స్టీల్ ప్లాంట్లు మాత్రమే ఉండేవి. ఇటీవల ఆర్సెలర్ మిట్టల్ 17 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు పునాది వేశాం. ఇతర రాష్ట్రాల్లో దాదాపు ఒక దశాబ్దం పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్ ఇది. నేను ఆదిత్య మిట్టల్‌తో మొదటి జూమ్ కాల్ చేసినప్పటి నుంచి పునాది వేసే దశకు పర్యావరణ అనుమతులతో సహా చేరుకోవడానికి కేవలం 17 నెలలు పట్టింది. ఇదే మా వేగానికి నిదర్శనం.
ఏపీని ప్రపంచపటంలో నిలిపిన గూగుల్
మూడోది డేటా సెంటర్ ఎకోసిస్టమ్. విశాఖపట్నంలో ‘జీ’ అంటే గూగుల్ లోగో గుర్తొచ్చే స్థాయిలో అది విశాఖను ప్రపంచ పటంలో నిలబెట్టింది. గూగుల్ తో మొదటిసారి మాట్లాడినప్పుడు రెగ్యులేటరీ క్లారిటీ, పర్మినెంట్ ఎస్టాబిష్ మెంట్, ట్యాక్సేషన్ వంటి అంశాలపై వారికి కొన్ని ప్రత్యేక విధానాలు అవసరమయ్యాయి. మేము కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారితో మాట్లాడి స్పష్టత తీసుకువచ్చాం. అలా కేవలం 13 నెలల్లో గూగుల్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌లో పునాది పడింది. మీరంతా నమో అంటే నరేంద్ర మోడీ అని అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నమో అంటే నాయుడు జీ, మోదీజీ జోడి. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉంది. అందుకే ఇక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ప్రపంచానికి దిశానిర్దేశం స్థాయిలో ఎకోసిస్టమ్
ఈరోజు మనం స్కైరూట్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక సంవత్సరం క్రితం చాలా మందికి ఆ ప్రాజెక్టు గురించి తెలియదు. మేం ఒక సంవత్సరం క్రితం వారిని సంప్రదించాం. కేబినెట్ ద్వారా వారికి 300 ఎకరాల భూమిని కేటాయించాం. దేశంలో ఎవరూ ఊహించని ధరకు భూమిని అందించాం. ఈ స్టార్టప్‌పై పెట్టుబడి పెట్టాల్సిన అవసరాన్ని నా కేబినెట్ సహచరులను ఒప్పించడానికి నాకు 30 నిమిషాలు పట్టింది. ఇలాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్వాంటం విషయంలో కూడా ఇదే విధమైన కృషి జరుగుతోంది. కామకోటి గారి నాయకత్వంలో మేము అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. క్వాంటం రంగంలో భారత్‌కే కాదు, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఎకోసిస్టమ్‌ను నిర్మించబోతున్నాం.
మా నిబద్ధతక నిదర్శనం సాగర్ డిఫెన్స్
టెక్స్‌టైల్, షిప్‌బిల్డింగ్, డిఫెన్స్ వంటి రంగాల్లో కూడా భారీ అవకాశాలు ఉన్నాయి. మజగాన్ డాక్, గోవా షిప్ యార్డు వంటి సంస్థలు ఇక్కడ షిప్‌బిల్డింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. సాగర్ డిఫెన్స్ అనే ఆసక్తికరమైన సంస్థ ఉంది. వారు మారిటైమ్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. వారికి నీటికి అనుసంధానమైన స్థలం కావాలి. ఒక ఫిషింగ్ హార్బర్‌లో 150 మీటర్ల ప్రాంతాన్ని వారికి కేటాయించాం. వారు మా దగ్గరకు వచ్చినప్పుడు వారి విలువ దాదాపు రూ.3,000 కోట్లు. ఈరోజు ఆ సంస్థ విలువ రూ.23,000 కోట్లకు చేరుకుంది. ఇదంతా కేవలం 18 నెలల్లో జరిగింది. ఇదే మీ ప్రయాణంలో ప్రభుత్వం తీసుకురాగల మార్పు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబద్ధత. మేము మీ ప్రయాణంలో సంధానకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అభివృద్ధి ప్రయాణానికి ఏపీ సంసిద్ధం!
మీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మేము 23 క్లస్టర్లను నిర్మిస్తున్నాం. ఇవి హార్టికల్చర్ నుంచి క్వాంటం వరకు విస్తరించాయి. అగ్రికల్చర్, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా, ఆటోమోటివ్, సిమెంట్, సోలార్, ఇంగోట్, వాఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే 4.8 గిగావాట్ల రెన్యువబుల్ సామర్థ్యాన్ని పెంచగలిగాం. 2019 నుంచి 2024 వరకు చూస్తే ఐదేళ్లలో కేవలం 6 మెగావాట్లు మాత్రమే పెరిగింది. ఐదేళ్లలో 6 మెగావాట్ల నుంచి ఒకే ఏడాదిలో 4.8 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నాం. అయితే దానితో నేను సంతృప్తి చెందడం లేదు. మేం ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాం. ఏపీ నంబర్ వన్ కావాలి. అందుకోసం ప్రతి ఏటా దాదాపు 20 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించాల్సి ఉంటుంది. ఇదే మేము నిర్మిస్తున్న క్లస్టర్ ఎకోసిస్టమ్. ఇలా మొత్తం 23 క్లస్టర్లు ఉన్నాయి. స్పేస్, డ్రోన్స్, గ్లాస్ ఎకోసిస్టమ్ వంటి రంగాల్లో కూడా క్లస్టర్లు నిర్మిస్తున్నాం.
వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్‌కు ప్రాధాన్యత
మేం వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నాం. వర్టికల్ అంటే ఒక క్లస్టర్‌లోని మొత్తం కంపెనీలను ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకురావడం. మొబైల్ ఫోన్ లో కెమెరా తయారు చేసే కంపెనీ నుంచి గ్లాస్, కేసింగ్, బ్యాటరీ, యాక్సెసరీస్ వరకు మొత్తం సరఫరా వ్యవస్థ ఒకే క్లస్టర్‌లో ఉండాలి. హారిజాంటల్‌లో నా మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. అది కేవలం ఐటి మాత్రమే కాదు. హెచ్ ఆర్ డి కూడా నా దగ్గర ఉంది. హెచ్ఆర్ డి శాఖ ద్వారా పరిశ్రమలతో కలసి పనిచేస్తూ... కరిక్యులమ్ చేంజేస్, టెస్టింగ్ ఎకోసిస్టమ్, రీసెర్చిపై దృష్టి పెడుతున్నాం. ఐఐటి తిరుపతి ద్వారా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తో కలసి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని నేను కోరుతున్నాను. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సౌరశక్తి రంగంలో దాదాపు 90 శాతం పేటెంట్లకు సంబంధించి కీలక పాత్ర పోషించింది. ఐఐటి తిరుపతిలో మొత్తం రీసెర్చి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. ప్రైవేట్ రంగాన్ని, ఐఐటి తిరుపతిని ఒకచోటికి తీసుకువచ్చి రీసెర్చిపై దృష్టి పెడుతున్నాం. ఇలాంటి విధానాన్ని 23 క్లస్టర్లలో అమలు చేస్తాం, అందుకే మీరు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవాలి. విద్యుత్ వినియోగం విషయంలో కూడా మాకు భారీ సవాళ్లు ఉన్నాయి. అన్ని కంపెనీలు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించక ముందే మన విద్యుత్ వినియోగ వృద్ధి రేటు సంవత్సరానికి 30 శాతానికి పైగా ఉంది. అందువల్ల గ్రిడ్‌ను నిర్వహించడం చాలా సవాలుగా మారుతోంది. అన్ని కంపెనీలు కమర్షియల్ ప్రొడక్షన్‌కు వెళ్లబోతున్నందున మేము మరింత కష్టపడి పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ తనదైన ప్రయాణంలో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో ఐఐటిల నుంచి మార్గదర్శకత్వం పొందడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.
క్లస్టర్ల అభివృద్ధిలో మార్గదర్శకత్వం వహించండి
నాకు రెండు ప్రత్యేక అభ్యర్థనలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే వేదికపై ఉన్న నాయకత్వంతో కూడా పంచుకున్నాను. మొదటిది — ప్రపంచాన్ని జయించిన మీ గ్రాడ్యుయేట్లు. విద్య నుంచి వ్యవసాయం, హార్టికల్చర్ నుంచి క్వాంటం వరకు అనేక రంగాల్లో వారు అద్భుతమైన విజయాలు సాధించారు. ఈ 23 క్లస్టర్ల కోసం వారితో కలిసి లోతైన, అర్థవంతమైన పరిజ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీ పరిచయాలను మరింత విస్తృతంగా ఉపయోగించండి. ముఖ్యమైన వ్యక్తుల సంప్రదింపు వివరాలను మాతో పంచుకోండి. నేను వ్యక్తిగతంగా కూడా వారిని సంప్రదించి, 23 క్లస్టర్లు దిశానిర్దేశం చేసేలా కృషి చేస్తాను. రెండోది విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్. AI యుగంలో ఎంతో చేయగలం. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణాన్ని చూస్తే, మొదట స్పీడ్ ను మా మంత్రంగా తీసుకున్నాం. తర్వాత జుగాడ్ మోడల్‌కు వెళ్లాం. కానీ ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని నేను భావిస్తున్నాను. ప్రతి వ్యవస్థ కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి.ఈ విషయంలో మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. జుగాడ్ నుంచి ఇనిస్టిట్యూషన్ ఆఫ్ స్పీడ్ వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. భారతదేశాన్ని గర్వపడేలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మనం చేసే ప్రతి మంచి పని దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను నిర్మించగలిగితే, మిగతా భారతదేశం కూడా దాన్ని స్వీకరిస్తుందని నేను నమ్ముతున్నాను. అదే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం కూడా.
కలసి ప్రయాణిద్దాం... చరిత్ర సృష్టిద్దాం!
మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం. మన పనితీరును పునర్నిర్వచిద్దాం. నిజం చెప్పాలంటే, ఒక యువ భారతీయుడిగా నేను ఇతర దేశాల మోడళ్ల గురించి మాట్లాడటం వల్ల విసిగిపోయాను. ఇతర దేశాల గురించి మాట్లాడటం వల్ల విసిగిపోయాను. భారత్ చేయగలదని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. అందుకు ఒక మోడల్ ఇక్కడే ఉంది — అమరావతిలో, ఆంధ్రప్రదేశ్‌లో. నిన్న కొంతమంది ప్రముఖులతో నేను అమరావతిని సందర్శించాలని చెప్పాను. మీరు కూడా సమయం కేటాయించి అక్కడ జరుగుతున్న పనులను చూడండి. మీకు నిర్మాణంలో ఉన్న ఒక ఆధునిక నగరం కనిపిస్తుంది. భారతదేశం ఇంతకు ముందు చూడని ఒక నగరాన్ని నిర్మిస్తున్నాం. మనకు అత్యుత్తమ ప్లానర్లు, అత్యుత్తమ ఆర్కిటెక్టులు ఉన్నారు. మన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి భవనాలను ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ రూపొందిస్తున్నారు. వారి నుంచి నేర్చుకుంటూనే, భారతీయ కంపెనీలతో భాగస్వామ్యం చేయిస్తున్నాం. దీంతో నాలెడ్జి ట్రాన్సఫర్ ఇక్కడే జరుగుతుంది. మన స్వంత ప్రమాణాలను, మన స్వంత పరిశ్రమలను నిర్మించుకునేలా ఇది సహాయపడుతుంది. మీకు సమయం దొరికినప్పుడు అమరావతిని తప్పకుండా సందర్శించండి. ప్రతి 100 రోజులకు ఒకసారి మీరు అమరావతిలో జరుగుతున్న మార్పును చూడగలుగుతారు. ఇది జరుగుతున్న వేగం నిజంగా అద్భుతంగా ఉంది. నిన్న మా సీఆర్డీఏ కమిషనర్ నాకు ఒక మెసేజ్ పంపారు. “సార్, గత నెలలో మేము కొత్త రికార్డు సృష్టించాం” అని చెప్పారు. వచ్చే నెలలో ఆ రికార్డును కూడా అధిగమిద్దాం. ఇదే ఉత్సాహంతో మేమంతా పనిచేస్తున్నాం. భారతదేశం గర్వపడే స్థాయిలో ప్రమాణాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
అమరావతిలో 5వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు!
ఎయిర్ పోర్టులు అభివృద్ధి ప్రయాణంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని మేము నమ్ముతున్నాం. అమరావతిలో మీరు చూడబోయేది 5,000 ఎకరాల్లో నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్. హైదరాబాద్ అభివృద్ధిలో హైదరాబాద్ విమానాశ్రయం పోషించిన పాత్రలాగే ఇది కూడా అమరావతి అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది. ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించాలనుకుంటున్నాం. చంద్రబాబు గారిని విజనరీ అని ఎందుకు పిలుస్తారో ఒక కారణం ఉంది. హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నప్పుడు 5,000 ఎకరాలు ఎందుకు కావాలని ప్రజలు ప్రశ్నించారు. ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించినవారికి ఆయన అప్పట్లో తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత అర్థమవుతుంది. తెలంగాణ, హైదరాబాద్‌కు ఆయన అందించిన ఆ దూరదృష్టి ఇదే. అదే తరహా మేజిక్‌ను విశాఖపట్నంలోని భోగాపురం విమానాశ్రయంలో కూడా మేము చేస్తున్నాం. ఇటీవల నిర్మితమవుతున్న అత్యంత అందమైన విమానాశ్రయాల్లో ఇది ఒకటి. అమరావతిలో అంతకంటే మెరుగైనదాన్ని నిర్మిస్తాం. మాకు మార్గదర్శకత్వం అందించండి. మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అమరావతిని ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి హబ్ గా తీర్చిదిద్దే దిశగా కూడా మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే ఇక్కడ బిట్స్ తో సహా ఆరు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.క్వాంటమ్ చుట్టూ కూడా మొత్తం ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నాం. విద్య, పరిశోధన రంగాల్లో మనం చేస్తున్న పని చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఉన్న భాగస్వాములందరితో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. వేదికపై ఉన్న ప్రతి ఆలోచనాపరుడి సహాయం నాకు అవసరం. వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించడానికి మీ మార్గదర్శకత్వం అవసరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.