అక్టోబర్ 9న తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల.. హోంబలే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ ఎంట్రీ
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. హిందీలో అలాంటి అద్భుత విజయాలను సొంతం చేసుకున్న ఆధ్యాత్మిక చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ముందువరుసలో నిలుస్తుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర, బోధనల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా పరిమిత వనరులతో విడుదలైనప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో దేశవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అసాధారణ విజయాన్ని నమోదు చేసింది.
డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నీమ్ కరోలి బాబా పాత్రలో శోబినావ్ సత్యా అద్భుతమైన నటన కనబరచగా, చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రేయాస్ ధర్మాధికారి మరియు రిషి పాఠక్ అందించిన సంగీతం సినిమాలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు హత్తుకునేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
హిందీలో ఘన విజయం సాధించిన ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యాన్ని దక్షిణాది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ముందుకు వచ్చింది. తమ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విభాగంతో పాటు సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. భారీ విజయం సాధించిన ఈ డివైన్ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.