మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్.
జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్న 13 మండలాల్లో మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయా మండలాల్లోని మద్యం దుకాణాలు మూసివేసి ఉంచాలని స్పష్టం చేశారు. మద్యం విక్రయాలపై విధించిన తాత్కాలిక నిషేధం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, రాయదుర్గం, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, బుక్కరాయసముద్రం, కణేకల్లు, అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో ఈ ఆదేశాలు అమలు కానున్నాయి. ఆయా మండలాల పరిధిలోని మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మద్యం పంపిణీ చేసే అవకాశాలను అరికట్టడం, రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న పరిస్థితుల్లో మద్యం విక్రయాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసిన సమయంలో అక్రమంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పంపిణీ చేయడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది నిఘా కొనసాగించనున్నారు. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ, అక్రమ రవాణా వంటి చర్యలకు అడ్డుకట్ట వేయడంలో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం సంబంధిత నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల నిర్వహణపై తదుపరి చర్యలు ఉంటాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.