ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ, వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీఐపీ భక్తులకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఆలయానికి వచ్చే దాతలకు దేవస్థాన సంప్రదాయాలకు అనుగుణంగా మర్యాదలతో స్వాగతం పలకాలని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయ జెండా, అజెండాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉంటాయని, అమ్మవారి ఉత్సవాల్లో రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కోరారు. అమ్మవారిపై తనకు ఎంతో భక్తి ఉందని పేర్కొన్న కోటంరెడ్డి.. తాను కూడా ఎమ్మెల్యే అనే హోదాను దేవస్థానం బయటే వదిలి సాధారణ భక్తుడిలా అమ్మవారి దర్శనానికి వస్తానన్నారు. దసరా రోజున క్యూ లైన్‌లో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.