ధర్మవరంలో ప్రభుత్వ ఐటీఐ, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి విద్య కోసం విద్యార్థుల వలసలకు అడ్డుకట్ట వేయాలి పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర డిమాండ్
అనంతపురం బ్యూరో : ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలతో పాటు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం (పీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి ఆయన ఈ డిమాండ్‌ను వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంజుల నరేంద్ర మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో కియా వంటి పరిశ్రమలు, పుట్టపర్తి ప్రాంతంలో ఏర్పాటు అవుతున్న విమాన తయారీ పరిశ్రమ వంటి పారిశ్రామిక అవకాశాలు పెరుగుతున్నప్పటికీ స్థానిక విద్యార్థులకు అవసరమైన సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు.
ధర్మవరంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల లేకపోవడంతో వందలాది మంది విద్యార్థులు సాంకేతిక విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితి పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందన్నారు.
స్థానికంగానే నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక కోర్సులతో కూడిన ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ వసతి గృహాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనివల్ల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ లభించడంతో పాటు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
అలాగే మహిళా విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని నివారించేందుకు ధర్మవరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పీఎస్‌యూ నాయకులు భరత్, జగదీష్, హేమంత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.