పల్లెల్లో ఇక మెరుగైన వైద్యం
264 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు సిద్ధం
-రూ.103.16 కోట్లతో 24 జిల్లాల్లో 264 కొత్త భవనాల నిర్మాణం పూర్తి
-87 నియోజకవర్గాల్లో అందుబాటులోకి వచ్చిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు
-ఈనెల 6న గుడివాడలో మంత్రి సత్యకుమార్ ప్రారంభం
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 264 విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కొత్త భవనాల నిర్మాణం పూర్తయింది. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో నిర్మించిన ఈ కొత్త ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయనున్నాయి.రూ.103.16 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల్లోనే ప్రాథమిక వైద్య సేవలు అందేలా ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగా ఈ భవనాలను నిర్మించారు.
6న గుడివాడలో ప్రారంభం
కొత్తగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఈనెల 6న గుడివాడలో మంత్రి సత్యకుమార్ ప్రారంభించనున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో కొత్త భవనాలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణకు మరింత ఊతం లభించనుంది.
గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్యం
విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగానే అందే అవకాశం ఉంటుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు.. ప్రజలకు సమయానికి వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడనున్నాయి.24 జిల్లాలు.. 87 నియోజకవర్గాలు.. 264 కొత్త భవనాలు.. రూ.103.16 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ నిర్మాణాలు గ్రామీణ ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణలో కీలకంగా నిలవనున్నాయి. కొత్త భవనాలతో విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో మెరుగైన వాతావరణంలో ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడింది.గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసి.. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.