కిరాయి బకాయిలతో ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళం 18 నెలలుగా రూ.15 లక్షల బకాయిలు: యజమాని కర్నాటి కృష్ణ
సోమవారం వరకు గడువు.. లేకపోతే శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరిక
మిర్యాలగూడ అర్బన్,మేజర్ న్యూస్: మిర్యాలగూడ పట్టణంలోని పాత లలిత టాకీస్ సమీపంలోని భాగ్యలక్ష్మి కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీకి 18 నెలలుగా కిరాయి చెల్లించకపోవడంతో భవన యజమాని కర్నాటి కృష్ణ శుక్రవారం తాళాలు వేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, కిరాయి బకాయిలు మరియు విద్యుత్ బిల్లులు కలిపి సుమారు రూ.15 లక్షల వరకు రావాల్సి ఉందని తెలిపారు.
పలుమార్లు ఈఎస్ఐ ఉన్నతాధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరసనగా భవనానికి తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. అయితే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో ఈ నెల 29వ తేదీ (సోమవారం) వరకు గడువు ఇస్తున్నామని, అప్పటిలోగా బకాయిలు చెల్లించకపోతే 30వ తేదీ నుంచి శాశ్వతంగా భవనాన్ని మూసివేస్తామని హెచ్చరించారు.
ఈ విషయంపై ఈఎస్ఐ డిస్పెన్సరీ వైద్యాధికారి డాక్టర్ నాగేందర్ స్పందిస్తూ, కిరాయి బకాయిల అంశాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే బకాయిలు చెల్లించే చర్యలు చేపడతామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈఎస్ఐ డిస్పెన్సరీకి అవసరమైన సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ భవనం అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ప్రైవేట్ భవనంలోనే సేవలు కొనసాగుతున్నాయని వివరించారు.
సుమారు 45 వేల మంది కార్మికులకు ఈ డిస్పెన్సరీ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని, ప్రతిరోజూ 100 నుంచి 200 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. 18 నెలలుగా కిరాయి బకాయిలు ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరిస్తూ, సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు.