కమ్యూనిటీ హాల్ కు 20 ఏళ్లుగా కరెంట్ కరువు. అష్టగుర్తి లో సౌకర్యాలు లేక వినియోగానికి నోచుకోని భవనం
---కమ్యూనిటీ హాల్‌కు 20 ఏళ్లుగా కరెంటు కరువు!
--ఎన్నికల హామీలు నీటిమూటలేనా?
--పట్టించుకునే నాథుడేరీ..
--అష్ణగుర్తి లో సౌకర్యాలు లేక వినియోగానికి నోచుకోని భవనం
వైరా రూరల్ (సూర్య న్యూస్):- అక్టోబర్ 13
ప్రజల సౌకర్యార్థం నిర్మించిన భవనం.. ప్రజాప్రతినిధుల హామీలకు సాక్ష్యంగా నిలుస్తున్నా, నేటికీ కనీస సదుపాయాలకు నోచుకోని దుస్థితి. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్ పరిస్థితి ఇదీ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2003–05 సంవత్సరాల్లో ఎస్‌జీఆర్‌వై పథకం కింద రూ.2.50 లక్షల నిధులతో నిర్మించిన ఈ భవనానికి నేటికీ విద్యుత్ సరఫరా లేకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది.
అప్పటి గ్రామ సర్పంచ్ కొండా ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ కమ్యూనిటీ హాల్‌ను అప్పటి మధిర శాసనసభ్యులు కట్టా వెంకట నరసయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. కాలనీవాసులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ భవనం ప్రారంభమై రెండు దశాబ్దాలు గడుస్తున్నా, అవసరమైన సౌకర్యాలు మాత్రం అందుబాటులోకి రాలేదని స్థానికులు వాపోతున్నారు.
--ఎన్నికల సమయంలో హామీలు.. ఆ తర్వాత పట్టించుకునే వారేరీ?
గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో కాలనీలోకి వచ్చే అభ్యర్థులు ఎస్సీ కాలనీ పెద్దలకు ఎన్నో హామీలు ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. తాము గెలిచిన వెంటనే కమ్యూనిటీ హాల్‌కు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, భవనానికి రంగులు వేయిస్తామని, బల్లలు ఏర్పాటు చేస్తామని, అందరూ సౌకర్యవంతంగా వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే ఎన్నికలు ముగిసి, గెలిచిన అభ్యర్థులు బాధ్యతలు చేపట్టిన తర్వాత కమ్యూనిటీ హాల్ సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
--శిథిలావస్థకు చేరుతుందేమోనని ఆందోళన
ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సి ఉండగా, కనీస సౌకర్యాలు లేకపోవడంతో దాని అసలు లక్ష్యం నెరవేరడం లేదని కాలనీవాసులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవనం క్రమంగా శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా మిగిలిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
--ఇప్పటికైనా స్పందించాలి!
సంబంధిత అధికారులు, ప్రస్తుత గ్రామపంచాయతీ పాలకులు స్పందించి కమ్యూనిటీ హాల్‌కు విద్యుత్ సరఫరా కల్పించాలని, భవనానికి మరమ్మతులు చేసి రంగులు వేయించాలని, అవసరమైన బల్లలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనం ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అష్ణగుర్తి ఎస్సీ కాలనీవాసుల సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం లభిస్తుందా? ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కమ్యూనిటీ హాల్‌కు పూర్వవైభవం తీసుకొస్తారా? అన్నది వేచి చూడాలి.