గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి
నారాయణపేట, సూర్య ప్రతినిధి :జిల్లాలోని ఊట్కూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వాటర్ బాటిల్ మూత మింగడంతో గొంతులో ఇరుక్కుని తొమ్మిది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూరుకు చెందిన లక్ష్మణ్, గాయత్రి దంపతుల 9 నెలల కుమారుడు ఆర్యవర్ధన్ ఈ నెల 12న ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటర్ బాటిల్ మూతను నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతులో ఇరుక్కుపోవడంతో చిన్నారి ఇబ్బంది పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వేళ్లతో ఆ మూతను బయటకు తీశారు.
అయితే, మూత తీసే క్రమంలో గొంతులో తీవ్ర గాయం కావడంతో మరుసటి రోజు చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే బాలుడిని మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం చిన్నారి మృతి చెందాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసికాయ ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు కంటతడి పెట్టించాయి.