జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్ 2న నిరసన
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐజేయూ పిలుపు మేరకు అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘డిమాండ్స్ డే’లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు మల్లవర్జుల వంశీ విద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించి, అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టం తీసుకురావాలని, కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. యూనియన్ నాయకులు, ప్రతినిధులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.