దోమ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత: ఒంటిపై డీజిల్ పోసుకొని రైతుల ఆందోళన
దోమ, మేజర్ న్యూస్ (అక్టోబర్ 01): వికారాబాద్ జిల్లా దోమ మండలంలో భూ వివాదం తారస్థాయికి చేరింది. కుటుంబ భాగస్వామ్య పంపకాలు పూర్తి కాకముందే, తమ దాయాదులు భూములను రియాల్టర్లకు అమ్ముతున్నారంటూ మోత్కూర్ గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రైతులు దోమ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో విసుగుచెందిన కొందరు రైతులు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామామంతో అప్రమత్తమైన పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వారిని సముదాయించి, ఆత్మహత్యాయత్నాన్ని భగ్నం చేశారు. బాధిత రైతుల సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. వివాదాస్పద భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా తక్షణమే నిలిపివేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేయడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
రిపోర్టర్ చాపల బద్రి.