గుడ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి: మంత్రి వాకాటి శ్రీహరి
గుడ్డు పోషక విలువలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
గుడ్లు తినండి.. ఆరోగ్యంగా ఉండండి
– మంత్రి వాకిటి శ్రీహరి
ఘనంగా ప్రపంచ గుడ్డు దినోత్సవ వేడుకలు
గుడ్డులోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిషన్ (నెక్), పౌల్ట్రీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద అంబర్‌పేటలో ప్రపంచ గుడ్డు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, రైతులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని, అందులో గుడ్డు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రజల్లో గుడ్డు పోషక విలువలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గుడ్డు, పాలు, మాంసం వంటి పోషకాహార పదార్థాల వినియోగంపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సమతుల ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని మంత్రి అన్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి పోషకాహార ప్రాధాన్యతను వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికీ గుడ్డు పోషక విలువల గురించి తెలియజేయాలని సూచించారు. జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఆరోగ్యం బాగాలేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. తాను కూడా ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని వ్యక్తిగత అనుభవాల ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
పౌల్ట్రీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
గుడ్డు ఉత్పత్తి అనేది కేవలం కోళ్ల పెంపకానికే పరిమితం కాదని, దాని వెనుక రైతులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, పశువైద్యులు, శాస్త్రవేత్తలు, రవాణా, మార్కెటింగ్ రంగాలకు చెందిన అనేక మంది శ్రమ దాగి ఉందని మంత్రి అన్నారు. పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందితే రైతులకు ఉపాధి, ప్రజలకు పోషకాహారం అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే పౌల్ట్రీ రంగంలోని సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమ ప్రతినిధులు, పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు
పాఠశాల స్థాయి నుంచే పోషకాహారం ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. పిల్లలకు గుడ్డు అందించే కార్యక్రమాల ప్రాముఖ్యతను గుర్తించి, పోషకాహారంపై అవగాహనను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గిరిజన తండాల వరకు గుడ్డు వినియోగం, పోషక విలువలపై ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు.
ప్రజలకు నాణ్యమైన గుడ్లు అందించడం ఎంత ముఖ్యమో, వాటి ఉత్పత్తి, నిల్వ, రవాణా, విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా సంబంధిత వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
పౌల్ట్రీ రంగానికి పూర్తి సహకారం
పౌల్ట్రీ రంగ అభివృద్ధికి అవసరమైన అంశాలను పరిశ్రమ ప్రతినిధులతో చర్చించి, ప్రభుత్వ స్థాయిలో పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం, రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, వైద్య నిపుణులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గుడ్డు పోషక విలువలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు, పౌల్ట్రీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గుడ్డు పోషకాలు సమృద్ధిగా కలిగిన, సామాన్యులకు అందుబాటు ధరలో లభించే ఆహారమని తెలిపారు. ప్రతిఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో గుడ్డును భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు పౌల్ట్రీ రంగ ప్రాధాన్యతను ప్రజలకు వివరించడమే ప్రపంచ గుడ్డు దినోత్సవం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. గుడ్డు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, పౌల్ట్రీ రంగ అభివృద్ధికి దోహదపడేలా ఈ వేడుకలు నిర్వహించారు.
పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. గుడ్డులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయని, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజూ గుడ్డు తినే అలవాటు చేసుకోవాలని సూచించారు. పోషకాహార లోపాన్ని తగ్గించడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే, హైదరాబాద్‌లో నవంబర్ 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, పౌల్ట్రీ రంగం యజమానులు, ముఖ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : దుబ్బాక యాదయ్య
అబ్దుల్లాపూర్ మెట్, మేజర్ న్యూస్...