శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వేంచేసియున్న ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 52వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములవారి దివ్య ఆశీస్సులతో ఈ ఉత్సవాలను ఆగమ శాస్త్రప్రకారంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 11వ తేదీ ఆదివారం ఉదయం 6:24 గంటల నుంచి 8:34 గంటల నడుమ చండీ కలశస్థాపనతో దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు అమ్మవారు భక్తులకు రోజుకో ప్రత్యేక అవతారంలో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శ్రీ చండీ అలంకారంతో ప్రారంభమై వరుసగా శ్రీ భవాని, శ్రీ గాయత్రి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ గజలక్ష్మి, మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి, శ్రీ కాళికా, దుర్గాష్టమి నాడు శ్రీ దుర్గాదేవి, మహర్నవమి రోజున శ్రీ మహిషాసురమర్దిని, చివరి రోజైన విజయదశమి పర్వదినాన శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపాల్లో అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ లలితా కుంకుమార్చన, మహన్యాసం, సంపుటీకరణ చండీ హోమం, సామూహిక నవావరణార్చన, సహస్రనామ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగుతాయి. అక్టోబర్ 12వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 గంటలకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సుజిత దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్ణాహుతి, రాత్రి కలశ ఉద్వాసన నిర్వహిస్తారు. ఇక విజయదశమి రోజైన అక్టోబర్ 20న తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి వార్షిక మహాభిషేకం, రాత్రి 9 గంటలకు శమీపూజ, పారువేటతో పాటు నగర రథోత్సవం నేత్రపర్వంగా జరగనున్నాయి. మరుసటి రోజు అక్టోబర్ 21న ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మహిళా భక్తుల కోసం తెల్లవారుజామున 1:30 నుండి 4 గంటల వరకు అంతరాలయ ప్రదక్షిణలకు అనుమతి ఉంటుందని, అయితే ఆఖరి మూడు రోజులైన అక్టోబర్ 18, 19, 20 తేదీలలో అంతరాలయ ప్రదక్షిణలు నిలిపివేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు. వివిధ ఆర్జిత సేవలు, పరోక్ష పూజలలో పాల్గొనదలచిన భక్తులు ఆలయ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని దేవస్థాన సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, చైర్మన్ ఏలూరు శిరీష తెలిపారు. భక్తులందరూ విశేష సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వానించారు.