గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్:తెలంగాణలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ కోర్స్‌లో నిర్వహించిన ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు ముఖ్యమంత్రి ఆహ్వానించారని, హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంతో పాటు దక్షిణ కొరియా తరహాలో క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కొరియా విశ్వవిద్యాలయాల శిక్షణా విధానాలను అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఆ దేశ వర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ వేదికగా లభిస్తున్న ఆదరణను కొనియాడుతూ, పర్యాటక రంగంతో పాటు క్రీడలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ట్రోఫీలను అందజేశారు.