గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే కీలకం
*గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే కీలకం*
- డీన్ డా. భూపాల్ రాజ్
గూడూరు లో ఎస్సార్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థుల ఆధ్వర్యంలో పిఆర్ఏ కార్యక్రమం
కమలాపూర్ అక్టోబర్ 01 మేజర్ న్యూస్ సూర్య :-
రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎస్‌ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గూడూరు గ్రామంలో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులు,సహజ వనరులు,రైతుల సమస్యలు,గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ ప్రజలు, రైతులతో కలిసి పిఆర్ఏ మ్యాపింగ్,వనరుల గుర్తింపు,గ్రామ సమస్యల విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు. గ్రామస్థుల అనుభవాలు,అభిప్రాయాలను సేకరించి,వాటిని గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ డీన్ డా. భూపాల్ రాజ్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో ప్రత్యక్షంగా పనిచేయడం ద్వారా విద్యార్థులకు వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వారికి చేరవేయడంలో వ్యవసాయ విద్యార్థులు వారధిగా నిలవాలని సూచించారు. గూడూరు సర్పంచ్ బండి వనజ కలాధర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు విద్యార్థులు నిర్వహించిన పిఆర్ఏ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందని తెలిపారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామీణ సామాజిక పరిస్థితులు, వ్యవసాయ సమస్యలు, రైతుల అవసరాలు మరియు భాగస్వామ్య గ్రామీణ అభివృద్ధి విధానాలపై ప్రత్యక్ష అనుభవం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ అధ్యాపకులు,విద్యార్థులు,గ్రామ ప్రజలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.