ఎస్‌ఐఆర్ అక్రమాలపై కాంగ్రెస్ భారీ ర్యాలీ
హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన.. పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (ఎస్‌ఐఆర్) డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కులను పరిరక్షిస్తూ పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.