డిజిటల్ సాంకేతికతను బోధనతో అనుసంధానం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
డిజిటల్ సాంకేతికతను తరగతి గది బోధనతో సమర్థవంతంగా అనుసంధానం చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం పెద్దపల్లి జిల్లాలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న డిజిటల్ అక్షరాస్యత శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో అందిస్తున్న అంశాలను ఉపాధ్యాయులు పూర్తిగా అవగాహన చేసుకొని, ఖాన్ అకాడమీ డిజిటల్ వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిర్దేశిత అభ్యసన ఫలితాలను సాధించేలా బోధన చేపట్టడంతో పాటు, వారి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.విద్యార్థుల్లో ముఖ్యంగా గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు డిజిటల్ సాధనాలను బోధనలో భాగం చేయాలని కలెక్టర్ సూచించారు. శిక్షణలో పొందిన జ్ఞానాన్ని పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో AMO డా. పి.ఎం. షేక్ ఉపాధ్యాయులకు శిక్షణ అంశాలపై మార్గదర్శకత్వం అందించారు. జిల్లాలోని 14 మండలాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.