పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ..
గన్నవరం, మేజర్ న్యూస్.: గుడివాడ ఉప విద్యాశాఖాధికారి కొండా రవికుమార్ గురువారం గన్నవరం లో రాయనగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లు, చిక్కీలు నాణ్యతగా ఉన్నాయా, కాలం చెల్లినవి వినియోగిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించి, ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని నమోదు చేసేందుకు పాఠశాలలో ప్రత్యేకంగా రికార్డు పుస్తకం నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాల విస్తరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బోర్డు ధ్రువీకరణ పత్రం పొంది, బదిలీలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రవికుమార్ సూచించారు.
గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణాజిల్లా..