అభివృద్ధే మంత్రంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది పామిడిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
అనంతపురం బ్యూరో : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందని తెలిపారు.
పామిడి పట్టణంలోని 6, 7వ వార్డుల్లో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షలతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి–పామిడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోనూ పలు అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తోందని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.