దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్
దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీరామ కాలనీలో ప్రత్యేక ఏర్పాటు చేయాలని మాజీ కౌన్సిలర్ కే లక్ష్మీనారాయణ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రామ్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం జల్ పల్లి సర్కిల్ కార్యాలయంలో డిసీని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. దసరా నవరాత్రి ఉత్సవాలను శ్రీరామ కాలనీలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, అందుకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కాలనీలో ఏర్పాటు చేస్తున్న మండపాల వద్ద లైటింగ్, శుభ్రతతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలపై ప్యాచ్ వర్క్ చేయించి, గుంతలను పూడ్చాలని, ఎక్కడైనా డ్రైనేజీ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బతుకమ్మ పండుగ రోజు జల్ పల్లి పెద్ద చెరువు, ముత్యాలమ్మ ఆలయ సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువు వద్ద మహిళలు బతుకమ్మ ఆడేందుకు, నిమజ్జనం చేసే సమయంలో లైటింగ్ తో పాటు చెత్తాచెదారాన్ని తొలగించి, మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం అధ్యక్షులు మస్న రవికుమార్, కంది బిక్షపతి, తదితరులు ఉన్నారు.
- అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.