డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అసంపూర్తికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడత్య మాన్‌సింగ్
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వ్యాఖ్యలపై మండిపాటు
ధారూర్,మేజర్ న్యూస్(అక్టోబర్ 05):ధారూర్ మండలంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సందర్శించి కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేసిన విమర్శలను ధారూర్ మండల కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడత్య మాన్‌సింగ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో మెతుకు ఆనంద్ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, కిటికీలు, తలుపులు, తాగునీటి సరఫరా, రహదారులు వంటి కనీస సౌకర్యాలు లేక ఇప్పటికీ దాదాపు 40 శాతం పనులు పూర్తికాలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అక్కడ అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. మిగిలిన పనులను స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పూర్తి చేయించి, అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్లను పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.మెతుకు ఆనంద్ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా వికారాబాద్ నియోజకవర్గానికి చెప్పుకోదగిన అభివృద్ధి చేయలేదని మాన్‌సింగ్ విమర్శించారు. కనీసం తన సొంత మండలాన్ని కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి సైడ్ డ్రెయిన్లు, అండర్ డ్రెయిన్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, కాంపౌండ్ వాల్స్, బ్రిడ్జిల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారని వివరించారు.అధికారం కోల్పోయిన బాధను జీర్ణించుకోలేకనే మెతుకు ఆనంద్ ఫ్రస్ట్రేషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాన్‌సింగ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మెతుకు ఆనంద్ ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా, ఎంత ఆరాటపడినా మళ్లీ ఎన్నికల్లో గెలవరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో కంటే మరింత భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని మాన్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
రిపోర్టర్ సుధాకర్.