బొల్లారం ఆయుధాల చోరీ కేసులో పురోగతి: ఏడుగురు అరెస్ట్, ఆర్మీ మాజీ సిపాయి మల్లేష్ 10 రోజుల పోలీసు కస్టడీకి
సికింద్రాబాద్ బొల్లారం ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో పాల్గొన్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్/సైబరాబాద్ నగర పోలీసు కమిషనర్ (సీపీ) సుమతి వెల్లడించారు. ప్రధాన నిందితుడైన మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా మల్లేష్ వద్ద నుంచి చోరీకి గురైన తుపాకులను (గన్స్) స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మల్లేష్ 2010లో ఆర్మీలో సిపాయిగా చేరాడు. అనంతరం 2025లో సికింద్రాబాద్ రెజిమెంట్‌లో పోస్టింగ్ పొందాడు. అయితే మోకాలి గాయం కారణంగా అతను తన ఆర్మీ సర్వీస్‌ను మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మల్లేష్, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పథకం రచించాడు. గతంలో కూడా అతనిపై రెండు చోరీ కేసులు నమోదు కావడం గమనార్హం.
పెద్ద ఎత్తున గోల్డ్ షాపులు, బ్యాంకుల్లో దోపిడీలు చేయడమే లక్ష్యంగా మల్లేష్ స్కెచ్ వేశాడని, ఇందులో భాగంగా మల్లికార్జున, నిరంజన్‌లతో కలిసి బొల్లారంలో ఆయుధాల చోరీకి ప్లాన్ చేశారని సీపీ సుమతి స్పష్టం చేశారు. అయితే ఈ ఆయుధాల చోరీ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం (Terror Angle) లేదని, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే చోరీకి పాల్పడ్డారని పోలీసులు తేల్చి చెప్పారు.