బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో ఆస్తులపై విచారణ జరపాలి ఎంపీ రఘునందన్ రావు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో ఆస్తులపై విచారణ జరపాలి
-తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి
-హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు కాపీలు అందజేత
-అవసరమైతే కోర్టులో తానే వాదనలు వినిపిస్తా
- ఎంపీ రఘునందన్‌రావు
పటాన్‌చెరు, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చోటుచేసుకున్నాయని ఆరోపణలు వస్తున్న అవినీతి అంశాలపై తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో ఫిర్యాదు చేసినట్లు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. పటాన్‌చెరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కేసీఆర్ కుటుంబం, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ తన సహచరుడితో కలిసి హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాతపూర్వక ఫిర్యాదు కాపీలు పంపించినట్లు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అనంతరం పెరిగిన ఆస్తుల వివరాలను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు చేసిన ఆరోపణలతో పాటు సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపైనా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనంలో సీఎం కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, బినామీ పెట్టుబడులపై రూ.50 వేల కోట్ల మేర ఆరోపణలు ఉన్నాయని, ఆ కథనం కాపీలను కూడా ఫిర్యాదుతో పాటు పంపించినట్లు రఘునందన్‌రావు తెలిపారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టులో తానే వాదనలు వినిపిస్తానని ఎంపీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు.
(రాము పటాన్ చెరు మండల రిపోర్టర్)