*అష్ణగుర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆవరణలో కొండచిలువ కలకలం!
*అష్ణగుర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆవరణలో కొండచిలువ కలకలం!*
*ఏళ్ల తరబడి పెరిగిన పిచ్చి మొక్కలు..*
*విషసర్పాలకు ఆవాసాలుగా మారిన వైనం!*
*ప్రజల ప్రాణభయాన్ని పట్టించుకునేదెవరు?*
*పారిశుధ్యంపై పంచాయతీ నిర్లక్ష్యమంటూ స్థానికుల ఆవేదన*
వైరా రూరల్ (సూర్య న్యూస్):-
ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 12 నుంచి 15 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి శుభ్రం చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోవడమే ఇలాంటి పరిస్థితులకు కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*అర్ధరాత్రి వేళ.. భారీ కొండచిలువతో కలకలం!*
గ్రామంలోని రామాలయం వద్ద మంగళవారం రాత్రి అన్నదాన కార్యక్రమానికి సంబంధించి వంట పనులకు వెళ్లిన ఎస్సీ కాలనీకి చెందిన యువకులు కొనకాల ఉపేందర్, మడుపల్లి సురేష్, బండారు రమేష్ పని ముగించుకుని రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా భారీ కొండచిలువ వారి కంటపడింది. ఊహించని ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన యువకులు వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల వారిని పిలిచారు. అనంతరం స్థానికులు కొండచిలువను చంపేశారు.
*ఐదారేళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కలు.. విషసర్పాలకు నిలయాలు!*
గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఆ ప్రాంతం నిరుపయోగంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా పరిసరాల్లో దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగి, పొదలు విస్తరించడంతో పాములు, తేళ్లు వంటి విషపూరిత జీవులకు ఆవాసాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు ఎప్పుడు ఏ విషసర్పం తమ ఇళ్లలోకి వస్తుందోనని భయాందోళనల మధ్య జీవిస్తున్నాయని వాపోతున్నారు.
*ప్రమాదం జరిగినప్పుడే స్పందిస్తారా?*
ప్రజల నివాస ప్రాంతాలకు సమీపంలో ఇంతటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది పరిసరాల పరిశుభ్రతపై తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం అవసరమని సూచిస్తున్నారు.
*ప్రజల భద్రతకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి!*
అష్ణగుర్తి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తక్షణమే తొలగించాలని, ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపట్టి, పాములు ఇతర విషపూరిత జీవులు నివాస ప్రాంతాల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి ప్రజల భయాందోళనలను తొలగిస్తారా? లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా? అన్న ప్రశ్నలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి.