telanagana
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి...!
సూర్య, హుజురాబాద్:ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి ప్రత్యామ్నాయంగా అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి సమన్యాయం జరపాలని ఓసీ జేఏసి జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కో ఆర్డినేషన్ కమిటీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథ యాత్రకు ఓసీ జేఏసి, బహుజన కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఈనెల 24న ఆదిలాబాద్ లో ప్రవేశించి 26న జనగామ, హన్మకొండ మీదుగా పరకాలకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుందని, ఈ సందర్బంగా పరకాలలో ఓసీ జేఏసి, బహుజన కుల సంఘాల ఆధ్వర్యంలో 26న సాయంత్రం 5 గంటలకు పార్టీలకతీతంగా 50 వేల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు.ప్రస్తుత రిజర్వేషన్ విధానంలో క్రిమిలేయర్ నిబంధనల అమలు లేకపోవడంతో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికే పొందిన కుటుంబాలకే ప్రయోజనాలు పునరావృతమవుతున్నయనే వాదనల నేపథ్యంలో, అర్హులైన ఇతర పేదలకు న్యాయం జరగాలన్నారు. ఓసీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన తరహాలోనే, అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆర్థిక స్థితిగతుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని వారు కోరారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే రాజ్యాంగ సవరణపై పార్లమెంట్లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసి రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు పోరెడ్డి శంతన్ రెడ్డి, ప్రోగ్రాం రాష్ట్ర కో ఆర్డినేటర్ సంధి తిరుపతి రెడ్డి, ఓసి జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షులు తాటికొండ ప్రభావతి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల జేఏసి కన్వీనర్ విష్ణుదాసు గోపాల రావు, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సంఘాల నేత తాటిపల్లి రాజన్న, ప్రోగ్రాం సోషల్ మీడియా కన్వీనర్ రావుల కిరణ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్ రావు, వెంకట్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి ప్రసాద్, బిసి సంఘాల రాష్ట్ర కార్యదర్శి బచ్చు ఆనందం, దళిత సంఘాల డివిజన్ నాయకులు వేల్పుల రత్నం, బత్తుల రాయలింగo, నాయకులు కంకణాల జనార్దన్ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, గూడూరి స్వామి రెడ్డి, బజాజ్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.