బెంగళూరు ఫైవ్‌స్టార్ హోటల్ పూల్‌లో అనుమానాస్పద రీతిలో జర్మన్, స్లోవాక్ జాతీయుల మృతి!
సూర్య జాతీయ డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు విదేశీ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని హలసూర్ ప్రాంతంలో ఉన్న లగ్జరీ హోటల్ 'కాన్మాడ్' (Conrad Hotel) మూడో అంతస్తులోని స్విమ్మింగ్ పూల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో లోపం తలెత్తడంతోనే ఇద్దరు విదేశీయులు విద్యుత్ ఆఘాతానికి (ఎలక్ట్రోక్యూషన్) గురై మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను జర్మనీకి చెందిన 57 ఏళ్ల అలెగ్జాండర్ మాక్సిమిలియన్ (లూఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సిబ్బంది), స్లోవాక్ రిపబ్లిక్కు చెందిన 45 ఏళ్ల జురాజ్ హోర్వాట్ (ఐబీఎం ప్రాజెక్ట్ మేనేజర్) గా గుర్తించారు.
పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం హోటల్ స్విమ్మింగ్ పూల్ లైట్లు ఆన్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. పూల్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌కు గురై సహాయం కోసం కేకలు వేశారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన అమెరికా జాతీయుడైన మ్యాథ్యూ డిసెంటిస్, పూల్ అటెండెంట్ రాహుల్ తివారీ కూడా స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను, బాధితులను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేసరికి జర్మన్ జాతీయుడు మృతి చెందగా, స్లోవాక్ జాతీయుడు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన మరో ఇద్దరి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, వారు కోలుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన యాజమాన్యం, ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు మరియు స్థానిక అధికారుల దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూల్ వద్ద ఉన్న అండర్ వాటర్ లైటింగ్, వైరింగ్, ఎర్తింగ్ లోపాలు మరియు నిర్వహణ వైఫల్యాలపై ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అధికారులు ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఫైవ్‌స్టార్ హోటల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.